Friday, January 6, 2012

కొత్త సంవత్సరం

  

"నేడు" అంటే ఎన్నో "నిన్న"లు సంపాదించిన అనుభవసారం 
అన్నాడో రచయిత..అవును,నిజమే..కొత్త సంవత్సరం అంటే అంతా కొత్తగా ఏమీ ఉండదు కదా..
"గడిచిన సంవత్సరపు జ్ఞాపకాల్ని పదిలంగా దాచుకొని జీవితం అనే ప్రయాణంలో ఇంకో మైలురాయి చేరటం.."

 ఎన్నో ఆశల్నీ,ఆశయాల్నీ గుండెల్లో ఉంచుకుని నూతన ఉత్సాహంతో మనసుకు రెక్కలు కట్టుకుని కొత్త సంవత్సరంలోకి అడుగు పెడతాం..కానీ,ఎంత మంది అదే ఉత్సాహాన్ని చివరి వరకు తమతో ఉంచుకుంటారు? "కొత్త ఒక  వింత,పాత ఒక రోత" అన్నట్టు..ఏ పనైనా కొన్ని రోజులే బాగుంటుంది.తర్వాత బోర్ కొట్టేస్తుంది..ఎంత బోర్ కొట్టిన,ఇష్టాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్తాడో వాడే "విజేత" కాగలడు...అది అందరికి సాధ్యం కాదనుకోండి ...కానీ ప్రయత్నిచడంలో తప్పు లేదుగా...

                    ఈ కొత్త సంవత్సరంలో మీ ఆశలన్నీ నెరవేరాలని మనస్పూర్తిగా                     ఆ దేవుణ్ణి ప్రార్థిస్థూ... 
                                                            ----  మీ   మానస
                                                                                              --
                                                                                                                 

                               
                                


 

Tuesday, November 8, 2011

"ది బెస్ట్ అఫ్ యండమూరి వీరేంద్రనాథ్"..అభిషిక్తం

"బాబూ...శంకరం.

నువ్వు పరీక్షలకు బాగా చదువుతున్నావని ఆశిస్తున్నాను. నాన్న ఆరోగ్యం బాగాలేదు. ముఖ్యంగా చెప్పేదేమిటంటే నాలుగు రోజుల క్రితం మన గుర్రం కాలు విరిగింది. ఆచార్యుల వారు కట్టుకట్టారు. కాని ఫలితం లేదు. అది బ్రతకాలంటే కాలు పూర్తిగా తీసేయాలట. రేపటి గురించి బాధ కన్నా నిన్నటి వరకు మనకు తోడుగా నిలిచిన గుర్రం కొట్టంలో తిండీ, నీరు ముట్టకుండా పడివుంటే, కడుపులో దేవేస్తుందిరా...బాబూ....ఆ గుర్రం విలువ ఇప్పుడు మరీ తెలుసొస్తుంది. నీవు ఇవేమీ మనసులో పెట్టుకోకు, బాగా చదువుకో, మీ నాన్నగారు నీకు ఏ లోటూ రాకుండా డబ్బులు పంపిస్తారులే. ఉత్తరాలు రాస్తుండు. పరీక్షలు బాగా వ్రాయి....

ఆశిస్సులతో....

మీ అమ్మ."

శంకరం ఆ ఉత్తరాన్ని చదివి నిస్త్రాణగా వుండిపోయాడు.
అతని కళ్ళముందో నల్లని గుర్రం చెంగుచెంగున దూకుతూ కనపడింది.
మూడు సంవత్సరాలనుంచీ అదే తమని పోషిస్తుంది. తమది చాల చిన్నా ఊరు. తన తండ్రి బండి ఒకటే ఆ ఊళ్ళో తిరిగేది. శంకరం బుగ్గలమీద నీటిని తుడుచుకున్నాడు. అతడి మనసంతా వికలమైపోయింది. ఆ రోజు చదువు మీద మనసు నిలవలేదు.

15 రోజుల గడిచాయి. పరీక్షలు వ్రాసి, ఊరు వెళ్ళాడు. అక్కడ తండ్రికి కరణంగారు తన దగ్గరే ఉద్యోగం వేయించారు. బండిని వడ్రంగి మేస్త్రికి అమ్మేసారు. అంతా బాగానే ఉంది. మరీ గుర్రం.....? శంకరం కొట్టంలోకి వడివడిగా వెళ్ళాడు. అక్కడుంది గుర్రం. మూడుకాళ్ళు ముడుచుకుని, ఒక కాలు మాత్రం నిటారుగా చాపుకుని ప్రక్కకు పడి ఉంది. దాని దగ్గరగా వెళ్ళి మోకాళ్ళ మీద కూర్చున్నాడు. కళ్లు తెరవడానికి కూడా ఒపికలేనట్టు అలాగే పడివుంది. ఆ ఇంటి లేమి, ఆ గుర్రపుశాలలో కూడా కనపడుతుంది. ఒక్క గడ్డి పరక కూడా లేదు.

ఒక చెట్టు కొట్టేయగానే దాన్ని అల్లుకున్న లత మరో ఆధారాన్ని చూసుకుని తన బ్రతుకు నిలుపుకుంటుంది. పడిపోయిన చెట్టు మాత్రం కృంగి   కృశించిపోతుంది. ఇపుడు ఆ గుర్రం అలాగే పడివుంది. కుటుంబం మాత్రం మరో జీవనాధారం చూసుకుంది. శంకరం నిశ్శబ్దంగా అక్కడ నుంచి బయటకు వచ్చేసాడు.
పట్నం రాగానే
కృత్రిమ కాలు తయారు చేసే ట్రస్ట్ గురించి వాకబు చేసాడు. ఆ అడ్రస్ పట్టుకొని అక్కడకు వెళ్ళాడు. అది ఒక భవంతి. ఒక మూల వడ్రంగి పని జరుగుతున్నది. మరోవైపు ఇనుపరేకుల్ని కాల్చి గుండ్రంగా  రూపుదిద్దుతున్నారు. శంకరం లోపల గదిలోకి ప్రవేశించాడు. డాక్టర్ భరద్వాజ...'నేను మీకేం చేయగలను....?' అన్నట్టు చూసాడు.

"ఒక కృత్రిమ కాలు కావాలి సార్" అన్నాడు శంకరం.
"మేము ఉన్నదే అందుకు" అన్నట్లు నవ్వాడు భరద్వాజ.
శంకరం కొద్దిగా తటపటాయించి "ఎంతవుతుంది డాక్టర్ గారు...?" అని అడిగాడు.
'అది అమర్చవలసిన కాలుని బట్టి వుంటుంది. అయుదారువేల దాకా కావొచ్చు' అన్నాడు డాక్టర్.
శంకరం అంత ధర ఉహించలేదు. శంకరం మొహం వాడిపోయింది. దిగులుగా కుర్చిలోనుంచి లేచాడు .
"నా దగ్గర అంత డబ్బు లేదు సార్" అన్నాడు. "ఎంతుంది ...?" సానుభూతిగా అడిగాడు డాక్టర్ భరద్వాజ.
"నూట డబ్బై అయిదు రూపాయలు. నా స్కాలర్ షిప్ అది."
డాక్టర్ తన ఆశ్చర్యాన్ని అణచుకుంటూ, "ఇంతకీ కాలు ఎవరికీ అమర్చాలి?" అనడిగాడు.
"మా...గుర్రానికి".
డాక్టర్ తలమునకలయ్యేంత ఆశ్చర్యంతో "గు...ర్రా...నికా" అన్నాడు.
శంకరం జరిగిందంతా చెప్పాడు. చెపుతుంటే  అతడి కళ్ళు తడి అయ్యాయి. డాక్టర్ కూడా బాగా కదిలిపోయినట్లు కనిపించాడు. కుర్చీ లోంచి లేచి శంకరం దగ్గరకు వచ్చి భుజం మీద చేయివేసి. "నేను నీకు ఉచితంగా ఒక కృత్రిమ కాలు ఇచ్చే ఏర్పాటు చేస్తాను" అన్నాడు.శంకరం ఆనందంతో డాక్టర్ కి  నమస్కారం చేసి బయటకు వచ్చాడు. మనుషులనే కాకుండా జంతువులను ప్రేమించిన ఆ కుర్రవాడి ఆశయం తమ ట్రస్ట్ వారి ఆశయం కన్నా గొప్పది అన్నట్టుగా తోచింది భరద్వాజకు ఆ  క్షణం.
శంకరం తమ పల్లెకు చేరేసరికి చాలా రాత్రి అయింది...ఆ రాత్రి నిద్రపోలేదు. ఒంటిగంట అవుతుండగా కొట్టంలో కొచ్చాడు. శంకరం నెమ్మదిగా
గుర్రం దగ్గరకు వెళ్ళి దాని కాలుకి తను తెచ్చిన కృత్రిమ కాలు తొడిగాడు.వీపుకు బెల్ట్ లు అమర్చి అతి కష్టం మీద దాన్ని లేపాడు.అది బాధగా లేచి రెండడుగులు వేసింది.

శంకరం కళ్ళు సంతోషంతో కలువ పూలయ్యాయి. గుర్రం మెడ మీద ప్రేమగా నిమిరాడు. తర్వాత వాళ్ళిద్దరూ ఊరిబయట కొచ్చారు.
ముందు అతడు...వెనకే అతడిని అనుసరిస్తూ గుర్రం....ఊరికి కొద్ది దూరంలో చుట్టూ కొండలు. మధ్యలో సెలయేరు, పచ్చిక బయళ్ళు వున్నాయి. పచ్చగడ్డి  చూడగానే గుర్రం ఆత్రంగా పరకలని తినసాగింది. గుర్రం నెమ్మది నెమ్మదిగా కొండలవైపు సాగిపోయింది. శంకరం ఇంకా అలాగే నిలబడి వున్నాడు.
గుర్రం ఇప్పుడు స్వేచ్చాజీవి.
అడవుల్లో మిగతా జంతువులలాగే అది బ్రతుకుతుంది.
కొండమలుపులో గుర్రం అదృశ్యమవటాన్ని శంకరం చూస్తూ ఉన్నాడు
సెలయేరు..., పచ్చిక బయళ్ళు... దూరపుకొండలు ..వెన్నెల...అన్ని అతన్ని ఆశీర్వచనాలతో అభిషిక్తుడ్ని చేస్తున్నట్లు చూస్తున్నాయి.

యండమూరి వీరేంద్రనాథ్ ... చిన్న కథలు

ఎడాదికెన్ని రోజులు?

తెలివి తేటలు, కామన్ సెన్స్ లేని మనిషి ఏవిధంగా మాటల్లో మోసపోతాడో చూడండి.
ఒక గుమాస్తా యజమాని వద్దకు వచ్చి ఒకరోజు క్యాజువల్ లీవ్ ఇమ్మని అడిగాడు.
"ఒకరోజు శెలవు కావాలా?"
"అవును సార్"
"సంవత్సరానికి 365 రోజులు రోజుకి నువ్వు ఏడుగంటలు పని చేస్తావు. ఆంటే నా దగ్గర 106 రోజులు పనిచేస్తున్నావన్నమాట. 365*7/24 అంతే కదా! అందులో 52 ఆదివారాలు. పది జాతీయ శలవు దినాలూ పొతే యిక మిగిలేదెంత?
"44 రోజులండి"
"రోజుకు గంట లంచ్ టైం , అరగంట టీ టైం లెక్కగడితే ఎన్ని రోజులవుతుంది?"
"43 రోజులండి"
"ఇంకెన్ని రోజులు మిగిలాయి?"
"ఒకరోజు"
"మరి ఆ ఒక్కరోజు నువ్వు శెలవు తీసుకుంటే ఎలా?"
గుమాస్తాకి ఏం మాట్లాడాలో తెలీదు. దీన్నే కామన్ సెన్స్ లేక పోవటం అంటారు.


త్యాగం

ఏమి ఆశించకుండా ప్రేమించటం ఎలాగో చెప్పిన పదేళ్ళ కుర్రవాడి కథ ఒకటి చదవండి.

పదేళ్ళ జాన్, తన చెల్లితో ఆడుకుంటూ ఉండగా, ఆ పాప పడిపోయి, తలకి గాయం తగిలి రక్తం చాలా పోయింది. జాన్ ది  ఆ గ్రూప్ రక్తం "నువ్వు నీ చెల్లికి కొంచెం రక్తం ఇస్తావా?" అని డాక్టర్ అడిగాడు. ఆ కుర్రవాడు కొంచెంసేపు మౌనంగా ఉండిపోయి, కాస్త తటపటాయించి చివరకు 'సరే' అన్నాడు. ఆ కుర్రాడు ఎందుకు సంశయిన్చాడో డాక్టరు మరోలా అర్ధం చేసుకున్నాడు. "పెద్దనొప్పిగా ఉండదు. అయిదు నిమిషాల్లో అయిపోతుంది. తరువాత చాక్లెట్ ఇస్తాను" అన్నాడు. తన శరీరంలోంచి రక్తం నెమ్మదిగా సీసాలోకి ఎక్కుతుంటే జాన్ మొహం క్రమక్రమంగా తెల్లబడసాగింది. పాప ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. జాన్ అలాగే పడుకుని ఉన్నాడు. డాక్టర్ దగ్గిరకొచ్చి "లే..చాక్లెట్ ఇస్తాను"అన్నాడు .
ఆ కుర్రవాడు భయపడుతూ నెమ్మదిగా అడిగాడు.
"ఇంకా ఎంత సేపటికి నేను చచ్చిపోతాను డాక్టర్".

డాక్టర్ విభ్రాంతుడై "రక్తం తీస్తే మనిషి చచ్చిపోతాడనుకున్నవా!" అని అడిగాడు
"అవును"
డాక్టర్ గొంతు వణికింది."అనుకునే ఇచ్చావా?' అన్నాడు కంపిస్తూ.

నా పేరేంటో చెప్పరూ..?

<source:beditor.com >

ఇల్లాలు కాకపూర్వం ఓ యువతి చదువూ, సంధ్య, తెలివీ, చాకచక్యం, సమయస్ఫూర్తీ, హాస్యం, లాస్యం అన్నీ కలిగిన అమ్మాయి.. అమ్మాయి అందం, తెలివీ, వాళ్ల నాన్న ఇచ్చిన కట్నం బాగా నచ్చిన ఓ చిన్నవాడు ఆ అమ్మాయి మెడలో మూడు ముళ్ళూ వేసి, ఓ ఇంటికి ఇల్లాల్ని చేసి, 'ఇదిగో అమ్మడూ ఈ ఇల్లు నీది' అని చెప్పేడు. ఆ ఇల్లాలు వెంటనే పయిట నడుముకి బిగించి, ఇంటిని అందంగా అలికి ముగ్గులు పెట్టింది. ఆ చిన్నవాడు వెంటనే ఆ ఇల్లాల్ని మెచ్చుకుని "నువ్వు ఇల్లు అలకడంలో నేర్పరివి.. ముగ్గులు వెయ్యడంలో అంతకన్నా నేర్పరివి.. సెబాష్ కీప్ ఇట్ అప్" అని ఇంగ్లీషులో మెచ్చుకుని భుజం తట్టాడు.. దాంతో ఆ ఇల్లాలు తెగ మురిసిపోయి, ఇల్లలకడమే ధ్యేయంగా తన జీవితాన్ని కొనసాగించింది. ఎల్లప్పుడూ ఇంటిని పరిశుభ్రంగా అలికి రంగురంగుల రంగవల్లికలు తీర్చిదిద్దింది. ఆ విధంగా ఆమె జీవితం మూడు అలుకు గుడ్డలూ - ఆరు ముగ్గుబుట్టలుగా సాగిపోతూ వచ్చింది. కానీ ఒకనాడా ఇల్లాలు ఇల్లలుకుతూ అలుకుతూ "నా పేరేమిటి చెప్మా?" అనుకుంది. అలా అనుకుని ఉలిక్కిపడింది. చేతిలో అలుకు గుడ్డా, ముగ్గు బుట్టా అక్కడ పడేసి కిటికి దగ్గర నిలబడి తల గోక్కుంటూ, " నా పేరేమిటి.. నా పేరేమిటి?" అని తెగ ఆలోచించింది. ఎదురుగా ఇంటికి నేమ్ బోర్డ్ వ్రేలాడుతోంది. మిసెస్. ఎం.సుహాసిని ఎం.ఏ. పిహెచ్.డి.. ప్రిన్సిపాల్ 'ఎక్స్' కాలేజి అని.. అవును అలాగే తనకి ఓ పేరుడాలి కదా.. ఇలా మర్చిపోయానేమిటి? ఇల్లలికే సంబరంలో పేరు మరిచిపోయాను.. ఇప్పుడెలాగ” అనుకుంది ఆ ఇల్లాలు. కంగారు పడిపోయింది. మనసంగా చికాగ్గా అయిపోయింది. ఎలాగో ఆ పూటకి ఇల్లలకడం కానిచ్చింది. అంతలో పని మనిషి వచ్చింది. పోనీ ఆమెకైనా గుర్తుందేమోనని " అమ్మాయ్! నా పేరు నీకు తెలుసా?" అని అడిగింది. "అదేమిటమ్మా! అమ్మగార్ల పేర్లతో మాకేమిటి పని? మీరంటే మాకు అమ్మగారే! ఫలానా తెల్లమేడ క్రింద భాగంలో అమ్మగారంటే మీరు" అన్నది ఆ అమ్మాయి. "అవున్లే పాపం నీకేం తెలుసు?" అనుకుంది ఇల్లాలు. స్కూల్ నించి మద్యాహ్న భోజనానికి వచ్చారు పిల్లలకైనా గుర్తుందేమో నా పేరు అనుకుంది ఇల్లాలు. " ఒరే పిల్లలూ, నా పేరు మీకు తెలుసా?" అని అడిగింది. వాళ్లు తెగ ఆశ్చర్యపడిపోయి " నువ్వు అమ్మవి.. నీ పేరు అమ్మే.. మేం పుట్టినప్పటినించీ మాకు తెలిసింది అదే .. నాన్నగారి పేరుతో ఉత్తరాలొస్తాయి. ఆయన్నంతా పేరుతో పిలుస్తారు గనుక మాకు తెలుసు. నీ పేరు నువ్వు మాకెప్పుడూ చెప్పలేదు గదా. పోనీ నీ పేరుతో ఉత్తరాలు కూడా రావు" అనేశారు వాళ్లు. అవును తనకెవరు ఉత్తరాలు రాస్తారు? అమ్మా నాన్న ఉన్నారుగాని నెలకో, రెండు నెలలకో ఫోన్ చేస్తారు. చెల్లెళ్లు అక్కలూ కూడా వాళ్ల వాళ్ల ఇళ్ళు అలుక్కోవడంలో నిమగ్నమై ఉన్నారు. వాళ్ళు అంటే ఏ పిళ్లిళ్లలోనో, పేరంటంలోనో కలిస్తే కొత్త ముగ్గుల్ని గురించో, వంటల్ని గురించో మాట్లాడుకోవడమే గాని ఉత్తరాలు లేవు. ఇల్లాలు నిరాశపడింది గాని ఆమెకి అశాంతి ఎక్కువైంది. తన పేరెలాగైనా గుర్తు తెచ్చుకోవాలనే తపన ఎక్కువైంది. అంతలో పక్కింటావిడ పేరంటం పిలవడానికొచ్చింది. పోనీ ఆవిడకేమైనా గుర్తుందేమోనని అడిగితే ఆవిడ కిసుక్కున నవ్వేసి, "మరే! మీ పేరు నేనడగాలేదు... మీరు చెప్పాలేదు.. కుడీచేతివైపు తెల్లమేడావిడ. అల్లదుగో ఆ మందుల కంపెనీ మేనేజరుగారి భార్య అనో లేకపోతే తెల్లగా పొడుగ్గా ఉంటుందే ఆవిడ అనో చెప్పుకుంటాం.. అంతే " అనేసింది ఆ ఇల్లాలు. ఇంక లాభం లేదు.. పిల్లల స్నేహితులు మాత్రం ఏం చెప్తారు.. వాళ్లకి కమలావాళ్ల అమ్మ అనో, ఆంటీ అనో తెలుసు.. ఇక భర్తగారొక్కరే శరణ్యం. ఆయనకే గుర్తుంటే ఉండాలి. రాత్రి భోజనాల దగ్గర అడిగింది.. "ఏవండి.. నా పేరు మర్చిపోయానండి.. మీకు గుర్తుంటే చెప్పరా?" భర్తగారు పెద్దగా నవ్వేసి.."అదేమిటోయ్! ఎన్నడూ లేనిది ఇవ్వళ పేరు సంగతి ప్రస్తావిస్తున్నావు. నిన్ను పెళ్లయ్యిన్నాటినుంచి "ఏమోయ్" అని పిలవడం అలవాటైపోయింది. నువ్వుకూడా అలా పిలవకండి. నా పేరు నాకుంది కదా అని చెప్పలేదు.. అందుకని నేనూ మర్చిపోయాను. ఇప్పుడేం? నిన్నందరూ మిసెస్ మూర్తి అంటారు గదా?" అన్నాడు. "మిసెస్ మూర్తి కాదండి. నా అసలు పేరు నాక్కావాలి. ఎలాగిప్పుడు?" అన్నది ఆవేదనగా.. "దానికేం పోనీ ఏదో ఒక పేరు పెట్టేసుకో కొత్తది?" అని సలహా ఇచ్చాడు ఆయన. "బావుండండి.. మీ పేరు సత్యనారాయణ మూర్తి అయితే మిమ్మల్ని శివరావు అనో సుందరరావు అనో పెట్టుకోమంటే ఊరుకుంటారా? నా పేరే నాక్కావాలి " అన్నది.. "బాగానే ఉంది. చదువుకున్నావు కదా. సరిటిఫికెట్ల మీద పేరుంటుంది కదా. ఆ మాత్రం కామన్ సెన్స్ లేకపోతే ఎలా.. చూసుకో వెళ్ళి " అని సలహా ఇచ్చాడాయన మళ్లీ... ఇల్లాలు సర్టిఫికెట్ల కోసం హోరాహోరీ వెతికింది. బీరువాలో పట్టుచీరెలు, షిఫాన్ చీరెలు,, నేత చీరెలు,, వాయిల్ చీరెలు. వాటి మ్యాచింగ్ జాకెట్లు, లంగాలు, గాజులు, పూసలు, ముత్యాలు, పిన్నులు, కుంకుమ భరిణలు, గంధం గిన్నెలు, వెండి కంచాలు, బంగారం నగలు అన్నీ పొందికగా అమర్చి ఉన్నాయేగాని అందులో ఎక్కడా సర్టిఫికెట్ల జాడ లేదు.. అవును .. తను పెళ్ళయిన తరువాత ఇక్కడికొచ్చేటప్పుడు అవి తెచ్చుకోలేదు. "అవునండి.. నేను అవి ఇక్కడికి తెచ్చుకోలేదు.. నేను మా ఊరు వెళ్లి ఆ సర్టిఫికెట్లు వెతుక్కుని నా పేరు అడిగి తెలుసుకుని రెండురోజుల్లో వచ్చేస్తాను" అని అడిగింది భర్తని. "బాగానే ఉంది. పేరుకోసం ఊరెళ్లాలా ఏం? నువ్వు ఊరెడితే ఈ రెండు రోజులూ ఇల్లెవరలుకుతారు?" అన్నాడు నాధుడు. అవును నిజమే మరి.. తనందరికన్నా బాగా అలుకుతుందని గదా .. ఆ పని ఎవర్నీ చెయ్యనివ్వలేదు ఇన్నాళ్లు.. ఎవరి పన్లు వాళ్ళకున్నాయి. ఆయనకి ఉద్యోగం, పిల్లలకు చదువులు.. వాళ్లకెందుకులే శ్రమ పాపం.... అనుకుని తనే ఆ పని చేస్తూ వచ్చింది... వాళ్లకి అసలు చేతకాదు మరి. అయినా పేరు తెలీకుండా ఎలా బ్రతకడం. ఇన్నాళ్లు ఆ విషయం గుర్తురాలేదు గనుక సరిపోయింది గానీ గుర్తొచ్చాక కష్టంగానే ఉంది.. "రెండు రోజులెలాగైనా కష్టపడండి.. నే వెళ్లి నా పేరు కనుక్కుని రాకపోతే బ్రతకలేకుండా ఉన్నాను" అని బ్రతిమిలాడి బయటపడింది ఇల్లాలు. " ఏమ్మా, ఇంతర్జంటుగా వచ్చావు? ఆయనా పిల్లలూ బావున్నారా? ఒక్కదానివే వచ్చావేం?" అని అమ్మా నాన్న ఆప్యాయంగానే పలకరించినా అందులో కొంత సందేహాన్ని కూడా జోడించారు. వచ్చిన పని వెంటనే గుర్తుకొచ్చి... "అమ్మా! నా పేరేమిటో చెప్పమ్మా" అనడిగింది ఎంతో దీనంగా ఇల్లాలు... " అదేమిటమ్మా నువ్వు మా పెద్దమ్మాయివి.. నీకు బి.ఏ దాకా చదువు చెప్పింది యాభైవేలు కట్నం ఇచ్చి పెళ్లి చేశాం.. రెండు పురుళ్లు పోశాం.. ప్రతి పురిటికి ఆస్పత్రి ఖర్చులు మేమే భరించాం. నీకిద్దరు పిల్లలు. మీ ఆయనకి మంచి ఉద్యోగం.. చాలా మంచివాడు కూడానూ. నీ పిల్లలు బుద్ధిమంతులు" " నా చరిత్ర కాదమ్మా.. నా పేరు కావాలమ్మా నాకు.. పోనీ నా సర్టిఫికెట్లు ఎక్కడున్నాయో చెప్పు" " ఏమోనమ్మా ఈ మధ్యన అలమారల్లో పాత కాగితాలు, ఫైళ్లు అన్నీ ఖాళీ చేసేసి గాజు సామాన్లు సర్దించాం. కొన్ని కొన్ని ముఖ్యమైన ఫైళ్లు అటకమీద పడేశాం.. రేపు వెతికిద్దాంలే.. ఇప్పుడు వాటికేం తొందర.. హాయిగా స్నానం చేసి భోజనం కానియ్యమ్మా... అన్నది ఆ ఇల్లాలి తల్లి.. ఇల్లాలు హాయిగా స్నానం చేసి భోజనం చేసింది కానీ నిద్ర రాలేదు.. ఆడుతూ పాడుతూ ఇల్లలుకుతూ ముగ్గు వేస్తూ పేరు మర్చిపోవడం వల్ల ఇలా ఇన్ని కష్టాలొస్తాయని ఎప్పుడూ అనుకోలేదు.. తెల్లవారింది గానీ అటకమీద ఫైళ్ళలో సర్టిఫికెట్లు వెతకడం పూర్తి కాలేదు. ఈలోగా ఆ ఇల్లాలు కనపడ్డ మనిషినల్లా ఆడిగింది.. చెట్టునడిగీ .. పుట్టనడిగీ.. చెరువునడిగీ.. తను చదివిన స్కూలునడిగి.. కాలేజినడిగీ, అరచీ, ఆక్రోశించి ఎట్టకేలకు ఓ మిత్రురాలిని కలిసి తన పేరు సంపాదించింది. ఆ స్నేహితురాలు తనలాగే తనతోనే చదువుకుని తనలాగే పెళ్ళి చేసుకుని, తనలాగా బ్రతుకు ఇల్లలకడం కాకుండా, ఇల్లలకడం బ్రతుకులో ఒక భాగంగా బ్రతుకుతూ తన పేరునూ, తన స్నేహితురాళ్ల పేర్లనూ కూడా గుర్తుంచుకున్న వ్యక్తి.. ఆ స్నేహితురాలు ఈవిణ్ణి చూడగానే గుర్తు పట్టి, " ఓ .. హాయ్ శారదా! నా ప్రియమైన శారదా!" అని కేకలు పెట్టి కౌగిలించేసుకుంది. అప్పుడా ఇల్లాలిని దాహంతో ఆర్చుకుపోయి , ఎండిపోయి ప్రాణంపోవడానికి సిద్ధపడిన వాడికి కొత్త కూజాలో నీళ్లు చెంచాతో నోట్లో పోసి బ్రతికించిన చందంగా .. బ్రతికించింది ఆ స్నేహితురాలు.. "నువ్వు శారదవి. నువ్వు మన స్కూలులో టెంత్ క్లాసులో ఫస్ట్ వచ్చావు. కాలేజీలో జరిగిన మ్యూజిక్ పోటీల్లో ఫస్టొచ్చావు. అప్పుడప్పుడు మంచి మంచి బొమ్మలు వేసేదానివి. మనందరం పది మంది స్నేహితులం.. వాళ్లందర్నీ నేను అప్పుడప్పుడూ కలుసుకుంటూనే ఉన్నాను. మేం ఉత్తరాలు రాసుకుంటూనే ఉన్నాం.. నువ్వొక్కదానివే మాకు అందకుండా పోయావు. చెప్పు! ఎందుకు అజ్ఞాతవాసం చేస్తున్నావు?" అని నిలదీసింది ఆవిడ. "అవును ప్రమీలా.. నువ్వు చెప్పింది నిజం. నేను శారదనే.. నువ్వు చెప్పేదాకా నాకు జ్ఞాపకం లేదు.. నా మెదడులోని అరలన్నీ కూడా ఇల్లు ఎంత బాగా అలకాలి అనే విషయం మీదే కేంద్రీకృతం అయిపోయాయి. ఇంకేం గుర్తు లేదు. నువ్వు కనపడకపోతే నాకు పిచ్చెక్కిపోయేది" అని శారద అనే పేరుగల ఆ ఇల్లాలు.. శారద సరాసరి ఇంటికి వచ్చి అటక ఎక్కి పాత ఫైళ్లు తిరగదోడి తన సర్టిఫికెట్లు, తను వేసిన బొమ్మలు, పాత ఆల్బంలు అన్నీ సాధించింది.. తను స్కూల్లో, కాలేజీలో గెలుచుకున్న ప్రైజులు కూడా వెతికి పట్టుకుంది. కొండంత సంతోషంతో ఇంటికి తిరిగి వచ్చింది. "నువ్వు లేవు.. ఇల్లు చూడెలా ఉందో.. సత్రంలా ఉంది. అమ్మయ్యా నువ్వొచ్చావు. ఇంక మాకు పండగేనోయ్" అన్నాడు శారద భర్త. "ఇల్లలకగానే పండగ కాదండి.. అవును గానీ ఇకనుంచీ నన్ను ఏమోయ్! గీమోయ్! అనకండి . నా పేరు శారడ.. శారదా అని పిలవండి. తెలిసిందా?" అని కూని రాగాలు తీస్తూ హుషారుగా లోపలికి వెళ్లింది. ఏ మూల దుమ్ము ఉందో?, ఎక్కడ సామాన్లు ఆర్డర్‌లో లేవోనని చాలా సీరియస్‌గా వెతుకుతూ, డిసిప్లిన్ కోసం తపనపడే శారద రెండు రోజులుగా దులపని సోఫాలో హాయిగా చేరబడి, తను తెచ్చిన బొమ్మల్ని పిల్లలకి చూపిస్తుంది.

స్వచ్చమైన ప్రేమ

అమెరికాకు చెందిన ఒక సైనికుడు వియత్నాంలో యుద్ధం ముగించుకుని తన స్వస్థలానికి  తిరిగి వస్తున్నాడు.దారిలో   వస్తూ వస్తూ  తల్లిదండ్రులకు ఫోన్ చేశాడు.
“అమ్మా, నేను ఇంటికి వస్తున్నాను.ఈ సందర్భంగా మిమ్మల్ని ఒక కోరిక కోరాలనుకుంటున్నాను్.”
“ఏంటి బాబూ అది?”
” నా కొక  స్నేహితుడున్నాడు. వాడిని నాతో పాటు తీసుకురావచ్చా?”
“దానికేం భాగ్యం. అలాగే తీసుకుని రా బాబూ. నేనూ మీ నాన్న నువ్వు ఎప్పుడెప్పుడు వస్తావా అని వేయి కళ్ళతో ఎదురుచూస్తున్నాం”
“కానీ మీరు ఇంకొక విషయం కూడా తప్పకుండా తెలుసుకోవాలి. నా స్నేహితుడు యుద్ధంలో తీవ్రంగా గాయపడ్డాడు. మందుపాతర మీద పడడం వల్ల అతను ఒక చెయ్యి, కాలూ కోల్పోయాడు.అతనికి నా అన్నవాళ్ళెవరూ లేరు. ఎక్కడికీ వెళ్ళలేడు. అతన్ని మనతో పాటే ఉంచుకుందామని నా కోరిక.”
“ఎంత పని జరిగింది నాయనా! అలాగే తీసుకునిరా. అతనికి ఎక్కడో ఒక దగ్గర నివసించడానికి ఏర్పాట్లు చేద్దాం”
“కానీ అమ్మా! అతన్ని మనతో పాటే ఉంచుకోవాలని నా కోరిక”
తండ్రి అందుకుని “నాన్నా! ఒక వికలాంగుని మనతో పాటు ఉంచుకోవాలంటే అది ఎంత భారమో నీకు అర్థం కావడం లేదు. మన జీవితాలు మనవి. వేరే వాళ్ళ కష్టాలు కూడా మనం నెత్తిన వేసుకోవాల్సిన అవసరం లేదు. నువ్వు మాత్రం అవన్నీ మనసులో ఉంచుకోకుండా జాగ్రత్తగా ఇంటికి వచ్చెయ్. అతను ఎలాగోలా బ్రతగ్గలడులే”
అన్నాడు.
అవతలి వైపు నుంచి ఫోన్ కట్ అయిన శబ్దం వినిపించింది.
తరువాత కొడుకు దగ్గర్నుంచి వాళ్ళకి ఎలాంటి ఫోనూ రాలేదు. కొద్దిరోజుల తర్వాత, శాన్‌ఫ్రాన్సిస్కో పోలీసుల నుంచి ఆ దంపతులకు ఒక సమాచారం అందింది. దాని సంగ్రహం ఏమిటంటే వాళ్ళ కొడుకు ఒక భవనం పై నుంచి క్రిందపడి మరణించాడు. పోలీసులు దాన్ని ఆత్మహత్యగా భావిస్తున్నారు.
పుట్టెడు దు:ఖంలో మునిగిపోయిన ఆ తల్లిదండ్రులను పోలీసులు శవాన్ని గుర్తించడానికి మార్చురీకి తీసుకుని వెళ్ళారు.వాళ్ళు ఆ వ్యక్తిని తమ కుమారుడి గుర్తించారు. కానీ వాళ్ళకు ఇంకొక భయంకరమైన నిజం కూడా తెలిసింది. తమ కుమారుడికి ఒక చెయ్యి, కాలు లేవని.

ఉద్యోగానికి ఉచిత సలహాలు

(ఈ టపా అంధ్రభూమి మాస పత్రిక జనవరి 2009 సంచిక లో  గౌతమ్ రాస్తున్న 'తోటరామాయణం' అనే శీర్షిక కింద ప్రచురితమైనది)

కాలేజి నుండి బయటపడి మొదటి సారి ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న కుర్రాళ్ళు, కుర్రాళ్ళినిలకు సహాయపడటానికి నేను చేస్తున్న ప్రయత్నమిది....ఇంటర్వ్యూ లో నెగ్గుకురావటానికి కావలసిన కిటుకులను నేను కాచి, వడబోసి, ఇంటి బయట పారబోసాను. నా సీనియర్లు నాకు ఉచితంగా ఇచ్చిన సలహాలను నేను మీకందరికీ ఆ ఉచితంలో సగం ధరకే ఇస్తాను..

ఉద్యోగానికి దరఖాస్తు చెయ్యటానికి ముందు మనము చెయ్యవలసిన పని - వచ్చే జన్మలోనైన ఇటువంటి దుస్థితి రాకుండా ఓ పది, ఇరవై కోట్లకు వారసులుగా పుట్టేలా దీవించమని దేవుడికి మొక్కుకోవటం.

ఆ తరువాత resumé తయారు చేసుకోవాలి. తయారు చేసుకునే ముందు దానిని 'రెస్యూం' అనాలో, 'రెస్యూమే' అనాలో పెద్దలనడిగి తెలుసుకోవటానికి ప్రయత్నిచటం...ఎలా అన్నా ఒరిగేది ఏమీ లేదని తెలుసుకున్నాక అసలు పనికి ఉపక్రమించటం.

'రెస్యూమే ఎంత చిన్నగా ఉంటే అంత మంచిది ' అని చెప్పే ఉద్యోగ ద్రోహులు చెప్పే మాటలు వినకండి. మన తెలుగు క్యాలెండర్ లాగా కనీసం పన్నెండు పేజీలు ఉండేలా చూసుకోండి..ఆ తరువాత దాన్ని బైండింగు చేయించి, స్కూలు బ్యాగు లో మోసుకెళ్ళొచ్చు ఇంటర్వ్యూ కు.

పన్నెండు పేజీలు ఎలా నింపాలి??

మనం ఎంత వెధవలమయినా మనల్ని మనం ప్రేమించుకోవాలి. కాబట్టి, రెస్యూమే మొదటి పేజీ లో హైబ్రీడు తాటికాయంత అక్షరాలతో మన పేరు ఉండేలా చూసుకోవాలి. ఆ తరువాత మన ఫోన్ నంబరు, మన ఈ మెయిల్ ID రాయాలి. మన ఈ మెయిల్ ID దగ్గరే కంపెనీ వాళ్ళ దృష్టిని ఆకట్టుకునేందుకు ప్రయత్నించండి. ఏదో పేలవమైన ID కాకుండా crazyboy007@gmail.com లాంటి వంకర పేర్లు పెట్టుకుంటే మంచిది...మన రెస్యూమే జన్మలో మర్చిపోడు చూసినవాడెవడయినా.

ఈ వివరాల తరువాత objective రాయాలి...

objective అంటే ఈ రెస్యూమే ఎందుకు తయారు చేస్తున్నాము అని - అంటే ఉద్యోగం కోసమని - అంటే డబ్బు కోసమని - అంటే మూడు పూట్లా భోజనం కోసమని - అంటే రాత్రి పూట భోజనం చేస్తే బొజ్జ వస్తుందని - అంటే రాత్రి చపాతీలు మాత్రమే తినాలని....
కాబట్టీ, objective పక్కన 'చపాతీలు తినటం' అని రాయండి! మీ దూరదృష్టి అర్థమౌతుంది కంపెనీ వాళ్ళకు..

ఆ తరువాత మన అర్హతల వివరాలు...

పదవ తరగతి, ఇంటర్, గ్రాడ్యుయేషన్ మార్కు షీట్లు చూపించాలి కాబట్టి పెద్దగా అబద్ధాలు రాయకండి...కాని ఒకటవ తరగతి నుండి, తొమ్మిదో తరగతి వరకు రెచ్చిపోండి.

3వ తరగతి - ఫస్ట్ క్లాస్ విత్ డిస్టింక్షన్
5వ తరగతి - సౌత్ ఇండియా టాపర్
8వ తరగతి - పరీక్షలు రాయకుండానే పాస్

....ఇలా యధేచ్చగా రాసుకోవచ్చు.

ఆ తరువాత రెస్యూమే కు అతి ముఖ్యమైనది మన 'స్కిల్ సెట్' వివరాలు రాయటం (గుర్తుందిగా...పన్నెండు పేజీలు నింపాలి మనం)

ఇప్పుడిక్కడున్న అందరిలోకి మేధావిని నేనే కాబట్టీ నా 'స్కిల్ సెట్' గురించి ఎలా రాసానో చెబుతాను..దానిని నమూనా గా తీసుకుని మీ మీ స్కిల్ సెట్లు రాసుకోవచ్చు.

"నేను కాలేజీలో చివరి బెంచిలో కూర్చునేవాడిని..ముందు బెంచీ అబ్బాయిలు, అమ్మాయిలు క్లాసు జరుగుతున్నంత సేపు ఏవో చీటీలు రాసుకుని ఒకళ్ళకొకళ్ళు పాస్ చేసుకునేవాళ్ళు. అమ్మాయిలు ముసిముసి నవ్వులు నవ్వుకునేవాళ్ళు..అబ్బాయిలు ముసిముసి లేకుండా నవ్వుకునేవాళ్ళు. క్లాసు అయ్యాక ఆరోజు రాసుకున్న చీటిలన్నీ బెంచీల్లో వదిలేసి వెళ్ళిపోయేవాళ్ళు. అప్పుడు నేను, నాతోపాటు చివరి బెంచీల్లో కూర్చునే ఓ నలుగురిని వెంటేసుకుని ఆ చీటీలన్నీ హాస్టలుకు పట్టుకెళ్ళి, వాటిని క్షుణ్ణంగా చదివి...ఆ చీటిలలోని విషయాలన్నింటినీ రుబ్బి, ఒక కథగా రాసి, ఔత్సాహికులకు పంచిపెట్టేవాడిని."

చూసారా - ఒక నాలుగు పంక్తులు రాసి అందులో నా నిపుణతల్ని అన్నింటిని ఎలా ఇమడ్చానో! ఇది చదివిన వాళ్ళకు నా కష్టపడే మనస్తత్వం, నా అటెన్షన్ టు డీటెయిల్, నా నాయకత్వ లక్షణాలు, నా లోని టీం ప్లేయర్, పక్కవారితో పంచుకునే గుణం - అన్నీ కనిపిస్తాయి.

మీరు కూడా మీ సామర్థ్యాన్ని గురించి బుల్లెట్ పాయింట్ల రూపంలో కాకుండా ఇలా ఒక మినీ కథ రాస్తే పాఠకులు ఎక్కువగా ఆస్వాదిస్తారు.

ఆ తరువాత మనం కాలేజీలో చేసిన ప్రాజెక్ట్ల గురించి రాయాలి. ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోండి - మనది వసుధైక కుటుంబం. మన క్లాస్మేట్లు, మన సీనియర్లు అంతా మన ఇంటివాళ్ళే..వాళ్ళ ప్రాజెక్ట్లు మనవి కాదా, మన అరియర్లు వాళ్ళవి కావా? మొహమాటం లేకుండా ఎవరి ప్రాజెక్టు బాగుంటే అది పెట్టెయ్యండి రెస్యూమేలో..

ఆ తరువాత మన 'వ్యక్తిగత వివరాలు ' ఇవ్వాలి..రెస్యూమే మొదట్లో మనము రాసిన వివరాల్ని పీకి పాకాన పెట్టాలి..
మీ వంశవృక్షం మొత్తాన్ని ఒక ఫ్లోచార్టు లాగ గీసెయ్యండి. మీ పుట్టిన రోజు, బారసాల, మొదటిసారి గుండుకొట్టించుకున్న రోజు - ఈ వివరాలన్నీ రాస్తే ఇంటర్వ్యూ చేసేవాడికి బాగా దగ్గరౌతారు..

ఇవన్నీ రాసాక కూడా ఇంకా పన్నెండు పేజీలు నిండకపోతే ఈ రెస్యూమే టైపు చేసిన పేపర్ ఏ షాపులో కొన్నది, ఆ షాపు వాడు నెలకు అద్దె ఎంత కడుతున్నాడు, అద్దెలు బెంగళూరులో ఎలా పెరుగుతున్నాయి, బెంగళూరులో ఇంతమంది అమ్మాయిలున్నా మనల్ని ఒక్కరు కూడా ఎందుకు చూడట్లేదు - మన సృజనాత్మకతనంతా ఉపయోగించి ఇలాంటివెన్నో రాసుకోవచ్చు..

రెస్యూమే తయారయ్యాక దానికి పసుపు, కుంకుమ రాసి అప్లై చెయ్యాలనుకున్న కంపెనీలకు పోస్టు చెయ్యండి..చేసిన తరువాత తెలుస్తుంది - మనము ఇంకా గుప్తుల కాలంలో లేము, ఇప్పుడంతా ఆన్లైన్ అప్లై చేస్తారు అని...అప్పుడు కంప్యూటర్ మానిటర్ కు పసుపు, కుంకుమ రాసి ఆన్లైన్ దరఖాస్తు చెయ్యటం మొదలెట్టండి....

అప్ప్లై చేసేసాం కదా...ఇప్పుడు విశ్రాంతి! విశ్రాంతి తరువాత ఒక పాట. పాట అవ్వంగానే ఇంటర్వ్యూలు రావటం మొదలౌతాయి..

ఇంటర్వ్యూలో ఎటువంటి టెక్నికల్ ప్రశ్నలు అడుగుతారో మనకు తెలియదు...అలాంటప్పుడు వాటికి సమాధానాలు మాత్రం తెలుసుకుని ఏం చేస్తాం?? కాబట్టి, ఏ పుస్తకాలు చదువుకోకుండా నేరుగా వెళ్ళండి.

మామూలుగా శని, ఆదివారాల్లో కంపెనీలు 'వాక్-ఇన్ ' ఇంటర్వ్యూలు నిర్వహిస్తుంటాయి...వీటి వివరాలు పేపర్ లో చూడగానే చెయ్యల్సిన మొదటి పని - అదే ఊళ్ళో ఉన్న మన క్లాస్మేట్స్ ఎవ్వరూ ఆ 'వాక్-ఇన్ ' కు అటెండ్ కాకుండా చూసుకోవటం!
ఇందాక చెప్పినట్టు..నేను బేసిక్ గా మేధావిని. నెను నా మొదటి ఉద్యోగం కోసం వెతికే రోజుల్లో ఇలాగే ఓ శనివారం మధ్యాహ్నం రెండింటికి ఒక 'వాక్-ఇన్ ' ఉందని తెలిసింది. అదే ఊళ్ళో ఉంటున్న నా ఫ్రెండు దినకర్ కు ఫోన్ చేసి - "రేయ్...ఈ శనివారం మధ్యాహ్నం మ్యాట్నీ కి రెండు టికెట్లున్నాయి ..నువ్వు, నీ ఫ్రెండ్స్ ఎవరయినా వెళ్ళండి" అన్నాను...దానికి వాడు "అలాగే రా..థ్యాంక్స్. నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను..ఆదివారం పొద్దున ఆటకు, మధ్యాహ్నం ఆటకు నా దగ్గర రెండు టికెట్లున్నాయి....నీ ఫ్రెండ్స్ ఎవరినయిన తీసుకెళ్ళు...ఒకే రోజు రెండు సినిమాలు!" అన్నాడు.

వాడికి ఉద్యోగం వచ్చింది - నాకు రాలేదు..

సరే....మొత్తానికి 'వాక్-ఇన్ ' ఇంటర్వ్యూల సమయంలో ఎలా ప్రవర్తించాలో తెలిసిందిగా..ఇప్పుడు ఏదయినా పెద్ద కంపెనీ నుండి ఇంటర్వ్యూ పిలుపొచ్చింది అనుకోండి.....ఏమీ ఖంగారు పడొద్దు - వేరే ఎవరికో చెయ్యల్సిన కాల్ మీకు చేసుండొచ్చు...అలా కాకుండా నిజంగా మీకు వచ్చిందంటే..బైండింగు చేసిన రెస్యూమే పట్టుకుని వెళ్ళండి.

ఇంటర్వ్యూ గదిలోకి వెళ్ళగానే చెయ్యవలసింది - లోపల ఇంటర్వ్యూ చేసేవాళ్ళు ఎంత మంది ఉన్నారో చూడటం. ముగ్గురో, నలుగురో ఉంటే.."రెస్ట్ రూం కు వెళ్ళొస్తాను " అని చెప్పి వెనక్కు తిరిగి రెస్టు తీసుకోకుండా పరిగెత్తటమే! ఎందుకంటే..ఆ నలుగురిలో ఒక హీరో, ఇద్దరు క్యారెక్టర్ ఆర్టిస్టులున్నా...ఆ నాలుగోవాడు ఖచ్చితంగా విలన్ అయ్యుంటాడు.

అలాకాకుండా లోపల ఇంటర్వ్యూ చేసేవాడు ఒక్కడే ఉంటే ధైర్యంగా లోపలకు వెళ్ళండి...మనం ఎంత ధృడంగా కరచాలనం చేసాము అన్నది మన లోని ఆత్మవిశ్వాసాన్ని ప్రతిబింబిస్తుందట..కాబట్టి, ఆ ఇంటర్వ్యూ చేసేవాడు షేక్ హ్యాండు ఇస్తే వాడి చేతిని మాయాబజార్ లో రేలంగి చేతిని యస్వీ రంగారావు నలిపినట్టు నలిపిపారెయ్యండి.

ఆ తరువాత వచ్చే ప్రశ్నలకు కాస్త ఒళ్ళు దగ్గరపెట్టుకుని సమాధానం ఇవ్వాలి...ఈ ఇంటర్వ్యూ ఏ పోస్టుకు అని తెలుసుకుని రండి..ఉదాహరణకు - మీరు 'డాట్ నెట్' మీద పని చెయ్యాల్సిన ఉద్యోగానికి ఇంటర్వ్యూకు వెళ్ళారనుకోండి...అవతలి వాడు ఏమడిగినా 'డాట్ నెట్' గురించే మాట్లాడండి....

ప్ర: మీ గురించి కొంచెం చెప్పండి
జ : మై నేం ఈస్ గౌతం, డాట్ నెట్...నేను ఇంజనీరింగ్ చేసాను, డాట్ నెట్

ప్ర: వాట్ ఆర్ యువర్ స్ట్రెంత్స్?
జ : డాట్ నెట్

ప్ర: వాట్ ఆర్ యువర్ వీక్నెసెస్?
జ : నాట్ డాట్ నెట్

మనకు ఆ ఉద్యోగం దాదాపు వచ్చినట్టే....

కానీ అసలు పరీక్ష ఇప్పుడే...ఇంటర్వ్యూ మొత్తానికీ అత్యంత కీలకమయిన ప్రశ్న ఇప్పుడడుగుతాడు -

ప్ర: జీతం ఎంత కావాలి?
జ : ఏదో సార్...మీ దయ

అలా జవాబిస్తే దెబ్బ తిన్నట్టే...జీతం గురించి నెగోషియేట్ చెసేప్పుడు అగ్రెసివ్ గా ఉండాలి. 'జీతం ఎంత కావాలి ' అని అడగంగానే జేబులోంచి కత్తి తీసి టేబుల్ మీద గుచ్చాలి...ఆ తరువాత కావలంటే 'ఏదో సార్...మీ దయ ' అనొచ్చు....

జీతం కూడా మాట్లాడుకున్నాక...ఇక మనము ఆలోచించవలసింది మన 'బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ ' గురించి....మీరు గనక ఫ్లాష్ బ్యాకు లో ఏదయినా మర్డర్లు గట్రా చేసుంటే ఆ విషయాలు బయటపడకుండా బెదిరించవలసిన వాళ్ళను బెదిరించండి....

నేనిచ్చిన ఈ సలహాలన్నీ పాటించాక కూడా మీకు ఉద్యోగం వచ్చిందంటే...మీ ఖర్మ...కంగ్రాట్స్!

రేపటి నుండి రోజూ ఉద్యోగం చెయ్యొచ్చు.....ఇంతవరకు సంతోషంగా గడిచిన మీ జీవితం ఇక సర్వనాశనం అయినట్టే...

యండమూరి వీరేంద్రనాథ్ ... చిన్న కథ